హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలి

26-11-2026 | 10:49pm
  1. రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  2. స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య

ఘట్ కేసర్, నవంబర్ 26 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్‌లోని(Ghatkesar Division) ఎన్‌ఎఫ్‌సీ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు,

ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక విధులు, సామాజిక బాధ్యతల గురించి కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి శాస్త్రీయ ఆలోచనా విధానం ఎంతో అవసరమని, మూఢనమ్మకాలు, వివక్ష, సామాజిక అసమానతలకు దూరంగా ఉంటూ హేతుబద్ధమైన ఆలోచనలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం సూచించిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి విలువలను ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. అనంతరం స్ఫూర్తి ఆర్గనైజేషన్ తరఫున భారత రాజ్యాంగ గ్రంథాన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులకు బహూకరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి జంపాల రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య, సభ్యులు సూర్య కాంత్, రామయ్య, యాదగిరి, మల్లేష్, పండిట్, కృష్ణ రావు, సత్యనారాయణ, చంద్రయ్య, సత్యారావు, ఐలయ్య, వెంకటయ్య, లక్ష్మీపతి, నారాయణరెడ్డి, హరిచంద్ర, గజానంద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు