లక్నవరం సరస్సులోకి గోదావరి జల్లాలు మళ్లించాలి

26-11-2026 | 11:09pm
  1. కరువు మండలంగా ప్రకటించి రైతులు, కూలీలను ఆదుకోవాలి
  2. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

గోవిందరావుపేట, నవంబర్ 26 (విజయక్రాంతి): రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం(Government) వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం(Telangana Farmers' Union) గోవిందరావుపేట మండల అధ్యక్షుడు గుండు రామస్వామి, కార్యదర్శి తీగల ఆగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు.

అనంతరం తహసీల్దార్ కుసుమ రవీందర్‌కు రైతుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు లేక కల్లాల్లోనే రాశులుగా పేరుకుపోయిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నాయకులు పేర్కొన్నారు. మండలంలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని, వ్యవసాయ పనులు లేక ఉపాధి కోల్పోయే వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ములుగు నియోజకవర్గం సమీపంలోనే గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. గోదావరి జలాలను లక్నవరం సరస్సులోకి మళ్లించే విధంగా శాశ్వత సాగునీటి ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాకు సీఐటీయూ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి సోమ మల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల చిట్టిబాబు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి మద్దతు ప్రకటించి మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు క్యాతం సూర్యనారాయణ, గుండు లెనిన్, కట్ట వెంకటేశ్వరరావు, కాప కోటేశ్వరరావు, నిమ్మల బిక్షం, మంచాల కవిత, బ్రహ్మచారి, కొమ్ము రాజు, అశోక్, శ్రీను, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు