బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దాలి
- నేరెళ్లను బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించిన కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్
- పిల్లలకు ఉన్నత విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత
తంగళ్లపల్లి, నవంబర్ 26 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లాను బాల్య వివాహ రహిత(Free from child marriage) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏడాది కాలంగా బాల్య వివాహాలు జరగకపోవడంతో గురువారం గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన వీవో భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞతో పాటు రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, నష్టాలపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అనంతరం బాల్య వివాహ రహిత గ్రామ ధ్రువీకరణ పత్రాన్ని సర్పంచ్‌కు అందజేశారు.కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నిర్ణీత వయసు వచ్చిన తర్వాతే పిల్లలకు వివాహాలు చేయాలని సూచించారు.
ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. బాల్య వివాహాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మహిళా సంఘాల సభ్యులు వీవో భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, సామాజిక రుగ్మతల నిర్మూలనపై సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.
మహిళలు పోషకాహారంపై శ్రద్ధ వహించాలని, పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, హక్కులపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన మాట్లాడుతూ పిల్లలను చదివించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.
బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహ ముక్త్ జిల్లాలు, రాష్ట్రాలు, దేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి విజయసాగర్, డీపీఓ వీరభద్రయ్య, ఇన్చార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీవో రమేష్, సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.