మూడున్నర గంటలు... 45 ఎజెండా అంశాలు

10-10-2026 | 05:30am

మొక్కుబడిగా దిశ సమావేశం 

మేడ్చల్, అక్టోబర్ 9 (విజయ క్రాంతి): జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం(Monitoring Committee (DISHA) Meeting) శుక్రవారం మొక్కుబడిగా జరిగింది. దిశా కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్(Disha Committee Chairman and Member of Parliament Etela Rajender) అధ్యక్షతన  కలెక్టరేట్ సమావేశ హాలులో జరిగిన దిశ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై ఎలాంటి దిశ నిర్దేశం చేయలేకపోయారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎజెండా అంశాలు చర్చించాల్సి ఉండడంతో అన్ని శాఖలపై పూర్తిస్థాయిలో చర్చించలేకపోయారు.

కొన్ని అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదు. సమావేశం మొదట్లో కొన్ని ఎజెండా అంశాలపైనే పూర్తిస్థాయి చర్చ జరిగింది. సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 11.15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.45 గంటలకు ముగిసింది. ఒకే సెషన్ మాత్రమే సమావేశం నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో రెండు సెషన్లు సమావేశం నిర్వహించి అన్ని ఎజెండా అంశాలపై క్షుణ్ణంగా చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు.

మేడ్చల్ లో మాత్రం ఒకే సెషన్ లో అన్ని ఎజెండా అంశాలు చదివి మమ అనిపించారు. సమావేశంలో ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావడానికి దిశ మినహా మరే వేదికలు లేవు. మున్సిపల్ కార్పొరేషన్ లకు పాలకవర్గాలు లేవు. పట్టణీకరణ చేయడంతో జిల్లా పరిషత్తులు కనుమరుగయ్యాయి. జిల్లా అభివృద్ధి మండలి సమావేశం జరగడం లేదు.

ఇలాంటి పరిస్థితిలో దిశ ఒకటే వేదిక అయింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనులపై చర్చించడానికి దిశ సమావేశం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అందుతోంది. దీంతో అన్ని శాఖలపై సమస్యలపై దిశ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉంది.

దీనిపై సుదీర్ఘంగా చర్చించి నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేయాల్సింది. కానీ ఒక్క మాటలో దీనిపై చర్చ ముగిసింది. ఎల్ నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిధులు సమకూర్చుకోవాలని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. సమావేశంలో మొదట మహిళా శిశు సంక్షేమం మీద ఎక్కువ చర్చ జరిగింది. ఆ తర్వాత మిగతా అన్ని అంశాలను మమ అనిపించారు.

చివరికి ఈటెల రాజేందర్ కూడా ఇలా ఒకటే రోజు అన్ని అంశాలు పెట్టే బదులు ఎప్పటికప్పుడు విద్యా వైద్యం పౌరసరఫరాలు వంటి మూడు నాలుగు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్ కు సూచించారు. అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లు కంఠం శిరీష కృష్ణారెడ్డి, జామురవి, శ్రీదేవి తమ మున్సిపాలిటీల పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దిశా కమిటీ సభ్యుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి గుండ్ల పోచంపల్లి, మేడ్చల్ చెరువులో కలుషితమై చాపలు చనిపోతున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ సమస్యలను విన్నవించారు. 

ప్రభుత్వ స్థలాలు కాపాడాలి :  ఎంపీ ఈటల రాజేందర్ 

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవాలని, పార్కు స్థలాలకు వెంటనే ఫెన్సింగ్ వేసి లేదా ప్రహరీలు నిర్మించి పిల్లల పార్కులుగా లేదా కమ్యూనిటీ హాల్స్ గా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఒక్క పార్కు భూమి కూడా కబ్జా కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

మేడ్చల్ జిల్లా అర్బన్ జిల్లాగా మారినందున కొత్తగా కంకర మిషన్లకు అనుమతి ఇవ్వవద్దని గనుల శాఖ అధికారులకు సూచించారు. ఒకవేళ ఇస్తే ఢిల్లీలో ఫిర్యాదులు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని స్పష్టం చేశారు. రావలకోళ్ గ్రామంలో ఎలా అనుమతిస్తారని మైన్స్ ఏడి సైదులను ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. అనుమతి ఎక్కడి నుంచి తెచ్చుకున్న ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వద్దన్నారు. 

మా సమస్యలు వినేవారు లేరు : ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

మేడ్చల్ నియోజకవర్గం లో అనేక సమస్యలు ఉన్నాయని సమస్యలు చెబుతామంటే వినేవారు లేరని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో ఒక్క పని కావడం లేదని, పట్టణీకరణ చేయడం వల్ల సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. విలీన మున్సిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పడిన ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో ఒక్క పని జరగడం లేదని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.

మల్కాజ్గిరి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను కోరారు. నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ మంజూరు అయిందని, 15వ ఆర్థిక సంఘం కింద నిధులు కూడా వచ్చాయని, కానీ ప్రభుత్వం కేటాయించిన భూమి కోర్టులో ఉందని తెలిపారు. ఫైర్ స్టేషన్ కు స్థలం కేటాయించాలన్నారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై సుచిత్ర వద్ద నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని దీనిని అడ్డుకోవాలన్నారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మను చౌదరి, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు వినయ్ కృష్ణారెడ్డి, సృజన, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కుతుబుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు