అధికారుల ఆదేశాలు బేఖాతర్

03-11-2026 | 05:05am
  1. దిగిరాని బియ్యం ధరలు 
  2. రూ. 100కు చేరువలో కిలో బియ్యం 
  3. ఇష్టానుసారం ధరలు పెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు 
  4. గోదాముల్లో అక్రమ నిల్వలు 

మేడ్చల్, నవంబర్ 2 (విజయక్రాంతి): అధిక ధరలకు(High prices) బియ్యం(Rice) విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ దుకాణదారులు(Shopkeepers) ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. జిల్లాలో వ్యాపారులు, దుకాణదారులు యధావిధిగా అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల కిలో బియ్యం ధర రూ. 100 చేరువైంది.

జిల్లా పౌరసరఫర అధికారులు ఇటీవల వ్యాపారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అంతేగాక ప్రతి దుకాణానికి ఆదేశాలు జారీ చేశా రు. బియ్యం అధిక ధరలకు విక్రయించిన, కృత్రిమ కొరత సృష్టించిన చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను దుకాణదారులు పట్టించుకోవడం లేదు. 

అధిక ధరలకు బియ్యం విక్రయం..

ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరలను డిస్ప్లే చేయాలని వ్యాపారులకు అధికారులు సూచించారు. కానీ ఏ దుకాణంలో కూడా ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరలు డిస్ప్లే చేయడం లేదు. తాము విక్రయించే ధరలను డిస్ప్లే చేస్తున్నారు. పౌరసరఫరాల కమిషనర్, రైస్ మిల్లర్ల అసోసియేషన్(Rice Millers Association) ప్రతినిధులు సమావేశమై ధరలు నిర్ణయించారు. తెలంగాణ బిపిటి కిలో రూ 66, తెలంగాణ సోనా కీలో రూ.74, శ్రీరామ గోల్ కిలో రూ.79 విక్రయించాలని నిర్ణయించారు. కానీ దుకాణాలలో హెచ్‌ఎంటి రా రైస్ కిలో రూ 97, సోనా మసూరి కిలో రూ.85, సోనా మసూరి రా రైస్ రూ.89 ధరలు డిస్ప్లే చేసి విక్రయిస్తున్నారు. ప్రభు త్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నప్పటికీ అధి కారు లు పట్టించుకోవడం లేదు. 

50 రోజుల్లో రూ. 25 పెరుగుదల..

బియ్యం ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 50 రోజులలో కిలోకు రూ. 25 వరకు పెరిగింది. 50 రోజుల క్రితం సోనామసూరి బియ్యం ధర కిలోకు రూ. 60 ఉండగా, ప్రస్తుతం రూ. 85 కు చేరింది. హెచ్‌ఎంటి రా రైస్ 100 రూపాయల చేరువలో ఉంది. బియ్యం ధరలు ఇంకా ఎంత పెరుగుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దాడులు చేసినా డోంట్ కేర్..

బియ్యం దుకాణాలలో అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ వ్యాపారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అధిక ధరలకే విక్రయిస్తున్నారు. ఇటీవల అధికారులు ఉప్పల్, బాలానగర్ ప్రాంతాలలో బియ్యం దుకాణాలపై దాడులు నిర్వహించగా, అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తే లింది. బస్తా మీద ఉన్న ధరపై మరో స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. నలుగురు వ్యాపారులపై కేసు లు నమోదు చేశారు. అయినప్పటికీ ధరలు దిగి రాలేదు. పెద్ద సూపర్ మార్కెట్లలో తనిఖీలు చేస్తే ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

ఎల్ నినోపై అతిగా ప్రచారమే కారణం..

ఎల్ నినోపై అతిగా ప్రచారం చేయడమే ధరల పెరుగుదలకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇంతకంటే ఎక్కువగా కరువు పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఇంతకంటే తక్కువ వర్షపాతం నమోదయింది. అయినప్పటికీ అప్పట్లో ఈ స్థాయి లో ధరల పెరుగుదల లేదు. భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని భావించి వ్యాపారులు గోదాములలో అక్ర మ నిల్వలు చేస్తున్నారు. గోదాములపై కూ డా దాడులు చేసి అక్రమ నిలువలను బయటకు తీయాలని ప్రజలు కోరుతున్నారు. రైస్ మిల్లులు, గోదాములు, పెద్ద సూపర్ మార్కెట్లలో నిరంతరం దాడులు నిర్వహించి బియ్యం ధరలు నియంత్రణలో ఉండేలా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు