డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం
ఘట్కేసర్ సీఐ పి. కిరణ్
ఘట్ కేసర్, నవంబర్ 27 (విజయక్రాంతి) : డ్రగ్స్ రహిత సమాజ(Drug-free society) నిర్మాణంలో విద్యార్థులు(Students) భాగస్వాములు కావాలని ఘట్కేసర్ సీఐ పి. కిరణ్(Ghatkesar CI P. Kiran) అన్నారు. ఎదులాబాద్లోని మేఘా ఇంజనీరింగ్ కళాశాలలో(Megha Engineering College) శుక్రవారం ఘట్కేసర్ సీఐ పి. కిరణ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీఐ కిరణ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను, చట్టపరమైన పరిణామాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి, క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే తమ వ్యక్తి గత లక్ష్యాలను చేరుకోగలరని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలైతే బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ దేశ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. కళాశాల పరిసరాల్లో గానీ, బయట గానీ ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను(Narcotic substances) విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం డయల్ 112, 1903 ద్వారా అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.