యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి
నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
గణపురం, నవంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(Young India Integrated Model Residential School) నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. శుక్రవారం గణపురం మండలం(Ganapuram mandal) మైలారం గ్రామంలో నిర్మిస్తున్న పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతి, భవనాల నిర్మాణ స్థితి, వ్యయం, బిల్లుల చెల్లింపులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. మొత్తం 12 భవనాలకు గాను 9 భవనాల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 3 భవనాల పనులు ప్రారంభించాల్సి ఉందని అధికారులు వివరించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రతి నెల నిర్దేశిత భౌతిక, ఆర్థిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు.
నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, అవసరమైన సిబ్బంది, యంత్రాలు, సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి నివేదికలు అందించాలని, నిర్మాణ పనులను డీఈఓ పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ
కార్యక్రమంలో డీఈఓ లలిత, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ భాస్కర్, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ అశోక్ కుమార్, ఏఈ జీవన్, నిర్మాణ సంస్థ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ విజయ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.