AI పై నటి సునయన ఫైర్
కృత్రిమ మేధస్సు (AI) సాయంతో వ్యక్తుల ముఖాలను మార్ఫింగ్ చేసి అసభ్యకర కంటెంట్ రూపొందిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఈ తరహా వ్యవహారంపై నటి సునయన(Actress Sunayana) స్పందించారు. తనను పోలిన అభ్యంతరకర వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని వెల్లడిస్తూ, ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సునయన కీలక విషయాలను ప్రస్తావించారు. తన ముఖాన్ని ఉపయోగించి డిజిటల్‌గా రూపొందించిన అసభ్యకర కంటెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాంటి వీడియోలను రూపొందించడానికి, ప్రచురించడానికి లేదా వ్యాప్తి చేయడానికి తాను ఎలాంటి అనుమతీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ చర్య తన గౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు, గుర్తింపునకు భంగం కలిగించడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారాలను సాధారణ ఆన్‌లైన్ ట్రెండ్‌గా చూడలేమని, ఇవి తీవ్ర పరిణామాలకు దారితీసే అంశాలని హెచ్చరించారు.
అభ్యంతరకర కంటెంట్‌ను రూపొందించడం మాత్రమే కాకుండా, దాన్ని అప్‌లోడ్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, రీపోస్ట్ చేయడం కూడా ఆపాలని సునయన సూచించారు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న వీడియోలను తొలగించాలని, వాటిని మరింతగా వ్యాప్తి చేయవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకునే హక్కును వినియోగించుకుంటానని ఆమె హెచ్చరించారు. ఇలాంటి వీడియోలు ఎక్కడ కనిపించినా వాటిని షేర్ చేయకుండా సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు రిపోర్ట్ చేయాలని తన శ్రేయోభిలాషులను కోరారు.
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ AI ద్వారా నకిలీ చిత్రాలు, వీడియోలు రూపొందించడం సులభమవుతోంది. అయితే, అనుమతి లేకుండా ఒకరి ముఖాన్ని ఉపయోగించి అభ్యంతరకర కంటెంట్ సృష్టించడం వ్యక్తిగత హక్కులు, గోప్యతకు సంబంధించిన తీవ్రమైన సమస్య. ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం, ప్రచారం చేయడం లేదా తిరిగి షేర్ చేయడం వల్ల చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సునయన చేసిన ఈ ప్రకటనతో మరోసారి సెలబ్రిటీల డిజిటల్ భద్రత, AI దుర్వినియోగం అంశాలు చర్చనీయాంశంగా మారాయి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్న ఆమె డిమాండ్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.