గంజాయి వ్యసనపరులను పట్టే యూరిన్ టెస్ట్ కిట్
చందుర్తి,అక్టోబర్ 28,(విజయక్రాంతి) : చందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి మరియు కోనరావుపేట మండలాల్లో గంజాయి రవాణా(Cannabis trafficking), విక్రయాలు, మరియు వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చందుర్తి సీఐ K. రవీందర్(Chandurthi CI K. Ravinder) తెలిపారు. గంజాయి అక్రమ దందాకు స్వస్తి చెప్పేందుకు ఒకవైపు విస్తృత తనిఖీలు చేపడుతూనే, మరోవైపు గంజాయి వ్యసనపరులను సాంకేతికంగా పట్టుకోవడానికి నూతనంగా అందుబాటులోకి వచ్చిన "యూరిన్ టెస్ట్ E-Z స్ప్లిట్ కీ డ్రగ్ స్క్రీన్ కిట్ల (Urine Test Kits)" ను వినియోగిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.
యూరిన్ కిట్ సాంకేతికత – పనితీరు: గంజాయి సేవించినట్లు అనుమానం ఉన్న వ్యక్తుల నుండి మూత్ర నమూనాలు సేకరించి, ఈ ఆధునిక “యూరిన్ కిట్” ద్వారా అక్కడికక్కడే పరీక్షలు వేగంగా నిర్వహించి, మూత్రంలో పరిమితికి మించి THC (Tetrahydrocannabinol - గంజాయిలో ఉండే ప్రధాన రసాయన పదార్థం (Marijuana)) ఆనవాళ్లు ఉన్నట్లు తేలితే 'పాజిటివ్' (Positive for THC) అని వస్తుంది. దీని ద్వారా సదరు వ్యక్తి గంజాయి సేవించినట్లు తక్షణమే ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది.
ప్రాథమిక పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారి నుండి వైద్యుల సమక్షంలో పూర్తిస్థాయి నిర్ధారణ ల్యాబ్ ద్వారా జరుగుతుంది.గంజాయికి బానిసలైన వారిని కేవలం శిక్షించడమే కాకుండా, వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే పోలీసు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశమని సీఐ గారు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా పట్టుబడిన వ్యసనపరులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని రిహాబిలిటేషన్ (పునరావాస) కేంద్రాలకు తరలించి మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
"గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా లేదా సేవించినా చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున వ్యసనపరులు తప్పించుకునే అవకాశం ఎంతమాత్రమూ లేదని హెచ్చరించారు.
యువత గంజాయి వంటి మహమ్మారికి దూరంగా ఉడాలని, చెడు వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆరోగ్యం మరియు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామాలు, పట్టణాల్లో గంజాయి విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని సీఐ k, రవీందర్ తెలిపారు.