సినిమా హిట్ టాక్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం మరోసారి నిజమైందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) అన్నారు. ఆయన నిర్మాణ భాగస్వామ్యంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి(Aakasamlo Oka Tara Movie) లభిస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిత్రంపై తాము పెట్టుకున్న అంచనాలను మించి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించిందన్నారు. ముఖ్యంగా ప్రీమియర్ షోలు ప్రారంభమైనప్పటి నుంచి అభినందన కాల్స్ వస్తూనే ఉన్నాయని తెలిపారు. తన సుదీర్ఘ సినీ అనుభవంలోనూ ఇంతటి స్పందన ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు.
ఈ సినిమా రూపకల్పనలో స్వప్న దత్(Swapna Dutt) చూపిన పట్టుదల, ఆలోచనా విధానాన్ని అల్లు అరవింద్(Allu Aravind) ప్రత్యేకంగా ప్రశంసించారు. నిర్మాత అశ్వనీదత్‌తో గతంలో ఏడు సినిమాలకు కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన, త్వరలోనే మరో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.