ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్
దామరచర్ల :నవంబర్ :20 : నల్గొండ జిల్లా(Nalgonda District) దామరచర్ల మండలం లోని వీర్లపాలెం సమీపంలో సోహన్ ఆగ్రో ఇండస్ట్రీ(Sohan Agro Industry) వారు రూ 750 కోట్ల వ్యయంతో 108 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఇథనాల్ పరిశ్రమ(Ethanol Industry) కు గ్రీన్ సిగ్నల్ లభించింది. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి(District Pollution Control Board) వారు గ్రామ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, పర్యావరణ వేత్తలు(Environmentalists) ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అవసరమైతే శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గాలి ,భూ గర్భ , నది జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం వైద్యశాల ఏర్పాటు చేసి సేవలు అందించాలని చెప్పారు. ఈ ప్రాంతంలో పశువులు,మేకలు ,గొర్రెలు అధికంగా ఉన్నందున సుమారు 2 వందల ఎకరాలు గ్రాసానికి కేటాయించాలని, పశువైద్య శాలను కూడా నిర్మించాలని చెప్పారు.
వేలాది ఎకరాల కు సాగునీరు అందించేందుకు అన్నమేరు వాగు పై నిర్మిస్తున్న వీర్లపాలెం -2 ఎత్తిపోతల ను పరిశ్రమ దత్తత తీసుకొని నిర్వాహణ బాధ్యతలు చేపట్టాలని కోరారు.అవసరం తీరాక తోక జడిస్తే ఊరుకునేది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఈ వెంకన్న ,ఆర్డీవో రమణారెడ్డి ,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ,ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , సర్పంచ్ ఎన్ శ్రావణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగు నాయక్,బిఅరెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, యూసుఫ్,పర్యావరణ వేత్తలు, కార్యకర్తలు ,వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కార్యక్రమం పూర్తి చేశారని కొందరు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.