ఆర్జీవీ కథ.. మోహిత్ సూరి మ్యాజిక్
బాలీవుడ్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి కలిసి ఓ ఆసక్తికరమైన సినిమా కోసం పనిచేయనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రొమాన్స్, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కనున్న బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన కథను ఆర్జీవీ.. మోహిత్ సూరికి అందించినట్లు తెలుస్తోంది.
వాస్తవిక కథనాలు, విభిన్నమైన నిర్మాణ శైలితో భారతీయ సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా క్రైమ్, గ్యాంగ్‌స్టర్, థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన కథన శైలితో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మోహిత్ సూరి (Mohit Suri) అంటేనే భావోద్వేగభరితమైన ప్రేమకథలు, ఆకట్టుకునే సంగీతం గుర్తుకొస్తాయి. 'ఆషిఖీ 2', 'ఏక్ విలన్', 'మలంగ్' వంటి చిత్రాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ అంశాలను మేళవించి సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.
ఈ ఇద్దరి కలయికలో సినిమా రూపొందితే కథనం, దర్శకత్వ శైలుల పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు మోహిత్ సూరి దర్శకత్వం వహించనున్నట్లు (Bollywood Collaboration) ప్రచారం జరుగుతోంది. అయితే నటీనటులు, నిర్మాణ సంస్థ, చిత్రీకరణ ప్రారంభ తేదీ వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఆర్జీవీ అందించిన కథతో మోహిత్ సూరి ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!