అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి
కొత్తగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ.. అర్హుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
నిర్మల్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎఫ్ఎస్సీఎస్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య ఆధ్వర్యంలో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని 42 వార్డులకు చెందిన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు కొత్తగా పెన్షన్లు మంజూరు కావడం ఊరటనిచ్చే విషయమన్నారు. అయితే ఇంకా అనేకమంది అర్హులు పెన్షన్లకు దూరంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.
కుటుంబంలో కారు ఉందని, కుమారుడికి ఉద్యోగం ఉందనే కారణాలతో అర్హులైన వృద్ధులకు పెన్షన్లు నిరాకరించడం సమంజసం కాదన్నారు. కుమారుడికి ఉద్యోగం ఉన్నంత మాత్రాన తల్లిదండ్రులను పోషిస్తున్నాడని భావించడం సరికాదని చెప్పారు. అనేక కుటుంబాల్లో వృద్ధులు తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
పెన్షన్ల మంజూరుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని కోరారు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు అందని వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించేలా పెన్షన్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.