ఆరుతడి పంటలను సాగు చేయాలి
- జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరీ సురేఖ
హాజీపూర్,(విజయక్రాంతి): ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరం ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరీ సురేఖ రైతులకు సూచించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో శనివారం నిర్వహించిన ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులు – 2026 యాసంగి పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో DAO మాట్లాడారు.
ప్రత్యామ్నాయ పంటలుగా పప్పు దినుసులలో పెసర, మినుము, శనగ, చిరుధాన్యాలు, ఇతర ఆహార పంటలలో జొన్న, మొక్కజొన్న, నూనె గింజల పంటలలో కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగతో పాటు వివిధ రకాల కూరగాయల సాగును ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు.
తక్కువ నీటి వినియోగంతో సాగు చేపట్టడం, పంటల వైవిధ్యీకరణ పాటించడం ద్వారా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించేలా ముందస్తు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) మామిడి కృష్ణ, సహాయ వ్యవసాయ సంచాలకులు (సస్యరక్షణ) గోపి, డివిజన్ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs), రైతులు తదితరులు పాల్గొన్నారు.