ప్రతి కుటుంబానికి బీమా భరోసా
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’(Indiramma Family Life Insurance Scheme)ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు.
ఈ పథకం కింద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడికి బీమా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల స్థాయిలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ శిబిరాల్లో అర్హులైన కుటుంబాలను గుర్తించి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, బీమా పొందే ప్రధాన సభ్యుడి వివరాలు, నామినీ వివరాలతో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినీ మైనర్ అయితే వారి సంరక్షకుడి వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు.
నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆధార్, నామినీ తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో నమోదు చేసి, స్కాన్ చేసిన ప్రతులను సంబంధిత బీమా సంస్థకు పంపించడంతో పాటు అసలు దరఖాస్తులను జిల్లా స్థాయిలో భద్రపరచనున్నట్లు వివరించారు.
బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారి ద్వారా వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. సంబంధిత అధికారుల పరిశీలన, జిల్లా స్థాయి ఆమోదం అనంతరం బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తారని పేర్కొన్నారు. అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత రూ.5 లక్షల బీమా పరిహారాన్ని నామినీ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటారని వివరించారు.
ఈ పథకంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన కుటుంబాలు ఈ నెల 19న నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలకు అవసరమైన వివరాలతో హాజరై పథకంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.