అసైన్డ్ భూముల కబ్జా.. దొంగ పట్టాలతో లబ్ధి.!

09-11-2026 | 01:44pm

జవహర్ నగర్ శివారులో 50 ఎకరాల భూమి ఆక్రమణ.?

బినామీ పేర్లతో పట్టాలు..

రైతుబంధు, బ్యాంకు రుణాలు పొందినట్లు ఆరోపణలు

గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన భేతి సతీష్

వెంకటాపూర్, నవంబర్ 09 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామ శివారులోని అసైన్డ్ భూముల ఆక్రమణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గ్రామ శివారులోని 368, 341, 441 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 50 ఎకరాల అసైన్డ్ భూమిని ములుగు మండలం జంగాలపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి, అక్రమంగా పట్టాలు పొందినట్లు వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన భేతి సతీష్ యాదవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో అసైన్డ్ భూముల ఆక్రమణపై పలు వార్తా కథనాలు ప్రచురితం కావడంతో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ స్పందించి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

విచారణలో అక్రమాలు వెలుగులోకి రావడంతో సదరు వ్యక్తి పేరు మీద ఉన్న కొంత భూమిని అప్పట్లోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే మిగిలిన సుమారు 45 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో బినామీ పట్టాలు పొందినట్లు ఆరోపించారు. అంతేకాకుండా సదరు భూములకు సంబంధించి రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందడంతో పాటు, పట్టాదారు పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు సైతం పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత సర్వే నంబర్లలో సమగ్ర విచారణ చేపట్టి, అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.

అధికారులు స్పందిస్తారా.?

గతంలో విచారణ జరిగినప్పటికీ మిగిలిన భూముల వ్యవహారం పరిష్కారం కాకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈసారైనా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బినామీ పట్టాల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటారా.? లేక మరోసారి కాలయాపన చేస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు