కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ

09-11-2026 | 01:13pm

వైద్య సేవలు, మందుల నిల్వ, సిబ్బంది హాజరుపై ఆరా

24 గంటలూ వైద్య సేవలు అందించాలని ఆదేశం

బూర్గంపాడు,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) సోమవారం ఉదయం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న ఆయన వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవల తీరును సమీక్షించారు. ఆసుపత్రిలోని ప్రయోగశాల (ల్యాబ్), ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగాలను సందర్శించారు. మందుల నిల్వలను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. రోగులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా? వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? అనే అంశాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాల్లో నిరంతరం పరిశుభ్రత పాటించాలని, చికిత్స కోసం వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఇబ్బందులు కలగకుండా 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విధులకు సమయపాలన పాటిస్తూ, రికార్డులను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్, వైద్యుడు అమరేందర్‌రెడ్డితో పాటు ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు