పండగపూట పెను విషాదం

09-11-2026 | 12:27pm

అనుబోస్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎదురెదురుగా ఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు –ఇద్దరు మృతి. ఒకరికి తీవ్ర గాయాలు

పాల్వంచ, నవంబర్ 9,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని అనుబోస్ కాలేజ్(Anubose College) వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా.గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. పాల్వంచ నుంచి దేవుజాతండా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం, కిన్నెరసాని వైపు నుంచి పాల్వంచకు వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదం తీవ్రతకు ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న అత్త–అల్లుళ్లలో టేకులపల్లి మండలం బిల్లు తండాకు చెందిన భూక్య సామ్య (37) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన అత్త తీవ్రంగా గాయపడగా, మరో ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు.

గాయపడిన వారిని స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మరో వ్యక్తి మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడు సామ్య, ఆయన అత్త పునుకుల గ్రామంలో జరుగుతున్న ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు