నీరు వృథా
09-11-2026 | 12:52pm
భిక్కనూర్, నవంబర్ 9 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) ప్రాంగణంలో నీరు వృథాగా పోతోంది. బోరు నుంచి నీటిని ట్యాంక్‌లోకి పంపించే పైపులకు భారీగా లీకేజీలు ఏర్పడటంతో నీరు వృథాగా బయటకు వెళ్తోంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో నీటి వినియోగాన్ని తగ్గించి, నీటిని పొదుపుగా వాడాలని అధికారులు సూచిస్తుంటే.. ప్రభుత్వ పాఠశాలలోనే ఇలా నీరు వృథా కావడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపుల లీకేజీలను అరికట్టి నీటి వృథాను నివారించాలని కోరుతున్నారు.