కాలుష్య కోరల్లో హైదరాబాద్.. ఢిల్లీతో పోటాపోటీ!
ఒకప్పుడు ప్రశాంత వాతావరణానికి చిరునామాగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీని తలపించేలా నగరంలో గాలి నాణ్యత (Air Quality) ప్రమాదకర స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 410గా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ స్థాయి కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం.. గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణాలైన పీఎం 2.5 (PM2.5 Particles) స్థాయులు సురక్షిత పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా, ప్రస్తుతం 278 మైక్రోగ్రాములకు చేరాయి. మరోవైపు పీఎం 10 స్థాయులు (PM10 Particles) 100 మైక్రోగ్రాముల పరిమితికి బదులుగా 326 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. అంటే సాధారణ స్థాయితో పోలిస్తే దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా కాలుష్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డిఫెన్స్ కాలనీలో ఏకంగా 685 ఏక్యూఐ నమోదైంది. శేరిలింగంపల్లిలో 666, మణికొండలో 602, యాంబియన్స్ ఫోర్ట్‌లో 596, ఎన్బీటీ నగర్లో 582గా కాలుష్య సూచీ రికార్డయింది. దీంతో ఆయా ప్రాంతాలు కాలుష్య హాట్స్పాట్లుగా మారుతున్నాయి.
నగరంలో వాయు కాలుష్యం పెరగడానికి ప్రధానంగా వాహనాల రద్దీ (Vehicular Emissions), అదుపులేని నిర్మాణ కార్యకలాపాలు, రోడ్లపై పేరుకుపోయిన దుమ్ముధూళి, పారిశ్రామిక ఉద్గారాలు కారణమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో నిరంతర నిర్మాణ పనులు, వాహనాల రాకపోకలు గాలి నాణ్యతను మరింత దిగజారుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని నగరవాసులు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లను తరచూ నీటితో శుభ్రం చేయడం, నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము వ్యాప్తిని అరికట్టడం, వాహన కాలుష్య తనిఖీలను కఠినతరం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ సైతం ఢిల్లీ తరహాలో గ్యాస్ ఛాంబర్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.