వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): జిల్లాలో వీధి కుక్కల(Stray dogs) సంచారాన్ని నియంత్రించి, వాటి కోసం ప్రత్యేక ఆశ్రయాలు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్(District Additional Collector) (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాగజ్నగర్ మండలం కోసిని గ్రామ శివారులో వీధి కుక్కల ఆశ్రయాల ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలని సూచించారు.
పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కుక్కల సంచారాన్ని అరికట్టాలని, వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ నాగేంద్ర, డీఈఓ సచ్చిదానంద చారి, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, మున్సిపల్ కమిషనర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.