వాహనదారులకు తప్పని అవస్థలు
- గడ్డపోతారంలో రహదారులపై భారీ వాహనాల పార్కింగ్
- పార్కింగ్ కి చోటు లేదా...? రోడ్డే దిక్కా..?
జిన్నారం, నవంబర్ 13, గడ్డపోతారం మున్సిపాలిటీ(Gaddapotharam Municipality) పరిధిలోని పారిశ్రామిక ప్రాంతంలో రహదారులపై భారీ వాహనాల పార్కింగ్(Parking for heavy vehicles) సమస్య తీవ్రరూపం దాల్చింది. పరిశ్రమల యాజమాన్యాలు తమ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ప్రధాన రహదారులనే పార్కింగ్ స్థలాలుగా వినియోగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లీ ఫార్మా, విరుపాక్ష, మైలాన్, హెట్రో, లూసెంట్ తదితర పరిశ్రమలకు చెందిన భారీ వాహనాలను రోడ్ల పక్కన, రహదారులపై నిలిపివేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారులపై భారీ వాహనాలు నిలిచిపోవడంతో రోడ్లు కుంచించుకుపోయాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించేవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రివేళల్లో రహదారులపై నిలిపిన భారీ వాహనాలు ప్రమాదాలకు కారణమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమల కార్యకలాపాలకు అనుగుణంగా వాహనాల నిలుపుదలకు తగిన స్థలాలను యాజమాన్యాలే ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా, ఆ బాధ్యతను విస్మరించి ప్రజా రహదారులపై వాహనాలను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు స్పందించి, నోటీసులు జారీ చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై మున్సిపల్ టీపీబీఓ నజీమ్ మాట్లాడుతూ, ఇప్పటికే సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.