మొక్కజొన్న సాగుతో అధిక దిగుబడులు సాధించాలి
డీహెచ్ఏం -206 రకం విత్తనాల పంపిణీ.. 110 రోజుల్లో పంట చేతికి: శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి
సిద్దిపేట రూరల్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటల వైవిధ్యీకరణలో భాగంగా రైతులు ఆరుతడి పంటల సాగుపై(Farmers cultivate wet crops) దృష్టి సారించాలని శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి సూచించారు. శుక్రవారం నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది రైతు వేదికలో తెలంగాణ విజ్ఞాన కేంద్రం, మొక్కజొన్న పరిశోధన కేంద్రం రాజేంద్రనగర్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కజొన్న విత్తన పంపిణీ, ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా DHM-206 రకం 110 రోజుల కాలపరిమితి కలిగి, ఎండు తెగులును తట్టుకుంటుందని, ఎకరాకు 40–42 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 200 ఎకరాలకు ఈ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ, చీడపీడల యాజమాన్యంపై డాక్టర్ అనూష అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని మండల వ్యవసాయ అధికారి పరశురాం రెడ్డి సూచించారు.
కార్యక్రమంలో భాగంగా నారాయణరావుపేట మండలానికి 75 ఎకరాలకు సరిపడా విత్తనాలు అందించిన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుర్రాలగొంది సర్పంచ్ స్వప్న హరీష్, మల్యాల సర్పంచ్ రఘు, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రేమ్ సాయి, వరుణ్ వర్మ, స్పందన రెడ్డి, 50 మంది రైతులు పాల్గొన్నారు.