పుష్కర ఘాట్ల మరమ్మతు పనులు సిద్ధం చేయాలి
- భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యమివ్వాలి.
- జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, నవంబర్ 5 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు(District Collector Borkhade Hemant Sahadeorao) సంబంధిత అధికారులను ఆదేశించారు.
పుష్కర ఘాట్లను సంసిద్ధం చేసేందుకు అవసరమైన మరమ్మతులు, నూతన పనుల ప్రతిపాదనల రూపకల్పనను వేగవంతం చేయాలని సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా లతో(District Forest Officer Vikas Meena) కలిసి గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాఖల వారీగా చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టైర్–1, టైర్–2, టైర్–3 ప్రాతిపదికన మంగపేట, చుంచుపల్లి, రామన్నగూడెం పుష్కర ఘాట్లను సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కర ఘాట్ల వరకు భక్తులు సులభంగా చేరుకునేందుకు అనుసంధాన రహదారుల నిర్మాణం, అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.
రహదారులకు అవసరమైన భూసేకరణ, భూముల లభ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, వ్యర్ధాల నిర్వహణకు, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లపై సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
ఘాట్ల వద్ద వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్‌లు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమ పరిధిలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.