నవజాత శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం
‘సంకల్ప్’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలి.. అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశం
ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో నవజాత శిశు(Newborn baby) మరణాల రేటును గణనీయంగా తగ్గించి, సింగిల్ డిజిట్‌కు తీసుకురావడమే లక్ష్యంగా ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి(District Collector Anurag Jayanti) అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కార్యక్రమం అమలుపై వైద్యాధికారులతో సమీక్షించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ తణిగైనాథన్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేసిన సంకల్ప్ కార్యక్రమం అనుభవాలను జిల్లాలోనూ వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
బీబీనగర్ ఎయిమ్స్ సహకారంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తణిగైనాథన్ ప్రత్యేక సెషన్ నిర్వహించి, ఆదిలాబాద్ జిల్లాలో కార్యక్రమం అమలు విధానం, సాధించిన ఫలితాలు, శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించడం, సురక్షిత ప్రసవాలు, ప్రసవానంతర సంరక్షణ, పుట్టిన వెంటనే శిశువులకు అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా మరణాల రేటును తగ్గించవచ్చని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణతో పాటు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
అనంతరం నవజాత శిశు సంరక్షణ, అంచనా చెకప్‌కు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సూర్యశ్రీ రావు, రామన్నపేట ఏహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆలేరు సీహెచ్‌సీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జె. స్వప్న రాథోడ్, యాదాద్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ కవిత, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.