వ్యసనాలకు ‘నో’ చెప్పాలి

28-10-2026 | 05:45pm
  1. చదువుతో పాటు క్రీడలు, పౌష్టికాహారంతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి
  2. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, అక్టోబర్ 28 (విజయక్రాంతి): విద్యార్థులు(Students) సామాజిక ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొని, చెడు వ్యసనాలకు ‘నో’ అని స్పష్టంగా చెప్పే గుణాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్(District Collector Borkhade Hemant) సహదేవరావు సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రీడలు, పౌష్టికాహారంతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రవ్యాప్త ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వర్చువల్ విధానంలో ప్రంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ మత్తుపదార్థాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మత్తురహిత సమాజ నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ అవగాహన  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో కలసి సందేశాన్ని వీక్షించారు.

అనంతరం కలెక్టర్ నషా ముక్త్ భారత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రారంభ దశలోనే వాటికి దూరంగా ఉండటం భవిష్యత్తులోనూ వ్యసనరహిత జీవితాన్ని కొనసాగించేందుకు దోహదపడుతుందని తెలిపారు. చెడు వ్యసనాలకు నో చెబుతూ, క్రీడలతో సన్మార్గంలో పయనించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

విద్యార్థులు చదువుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతిరోజూ క్రీడలు, శారీరక శ్రమకు సమయం కేటాయించాలని సూచించారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి తమకు ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలని, నడక, పరుగు వంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ అల్లం అప్పయ్య, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, సెక్రటరీ రాజి రెడ్డి, కోశాధికారి శిరుప సతీష్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు