జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ సందేశాలు..

06-10-2026 | 06:44pm

నకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు..

ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు..

ములుగు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ సందేశాలను పంపుతున్నారు. అయితే ఇది గుర్తించిన జిల్లా కలెక్టర్ తన పేరు, ఫొటోను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు పంపుతున్న నకిలీ వాట్సాప్ సందేశాలకు ఎవరూ స్పందించవద్దని, ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు(District Collector Borkhade Hemant Sahadeorao) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తన పేరు, ఫొటోను వాట్సాప్ డి.పి.లో పెట్టుకుని +66 98 476 2993 నంబర్ నుంచి అధికారులకు సందేశాలు పంపుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నంబర్ నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని, వెంటనే సంబంధిత నంబర్‌ను బ్లాక్ చేసి, వాట్సాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తన పేరు, ఫొటో కనిపించినంత మాత్రాన అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలను విశ్వసించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

అలాంటి సందేశాల ద్వారా డబ్బులు, బహుమతి కార్డులు అడిగినా స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, రహస్య సంకేత సంఖ్యలను ఎవరికీ ఇవ్వవద్దని కోరారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖుల పేర్లు, ఫొటోలను ఉపయోగించి ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. తన పేరుతో అనుమానాస్పద సందేశాలు వస్తే సంబంధిత సైబర్ నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు, అధికారులు, సిబ్బంది జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు