సీఎం పర్యటన వేళ.. బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

26-11-2026 | 12:22pm

అచ్చంపేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, పదర మండలాల్లో గురువారం తెల్లవారుజామున బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు పలువురిని అదుపులోకి (Police Custody) తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలుపై ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే అరెస్టులు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. అమ్రాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ అరెస్టును ఖండించారు. ప్రజాస్వామ్యంలో (Democracy) శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని స్పష్టం చేశారు.

నల్లమల బిడ్డగా అచ్చంపేటకు వస్తున్న ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారని, యువత, నిరుద్యోగులు, రైతులకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పోలీసుల నిర్బంధాలతో తమ పోరాటాన్ని ఆపలేరని, ప్రజా సమస్యలపై ఉద్యమం (Protest) కొనసాగిస్తామని వెల్లడించారు

మరిన్ని వార్తలు