రాజ్యాంగమే మన గర్వకారణం.. యోగి కీలక వ్యాఖ్యలు

26-11-2026 | 12:49pm

లక్నో: భారత రాజ్యాంగం(Indian Constitution) దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Uttar Pradesh CM Yogi Adityanath) అన్నారు. రాజ్యాంగం పౌరులకు హక్కులు కల్పించడమే కాకుండా, బాధ్యతలను కూడా గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా గురువారం లక్నోలోని లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం లోక్‌భవన్‌లో చేపట్టిన సౌందర్యీకరణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మాట్లాడిన యోగి.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకల్పన సమయంలో భారతీయులే తమ దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవాలన్న మహాత్మా గాంధీ ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచే కులం, ప్రాంతం, భాష, లింగభేదాలకు అతీతంగా ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం భారత ప్రజాస్వామ్య గొప్పతనమని వివరించారు. హక్కులను పొందడమే కాకుండా పౌరులుగా మన బాధ్యతలను నిర్వర్తించడం కూడా ముఖ్యమని యోగి పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు