పరువు కోసం కన్నకూతురిని చంపేశాడు

26-11-2026 | 12:44pm

ఆదిలాబాద్: ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పిన కూతురిని కన్నతండ్రే హత్య చేసిన ఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో కలకలం రేపింది. తాను చూసిన సంబంధాన్ని కాదని, మేనత్త కుమారుడిని ప్రేమించిందనే కారణంతో 18 ఏళ్ల యువతి కళ్యాణి(Kalyani)ని తండ్రి కైలాస్ హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ పరువు పోతుందనే ఆందోళనతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కళ్యాణికి ఈనెల 25న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే తాను మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నానని, అతడితోనే జీవితం కొనసాగిస్తానని నవంబర్ 23న తండ్రికి తెలిపింది. అప్పటికే కళ్యాణి గర్భం దాల్చినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు వస్తే కుటుంబ పరువు పోతుందనే భావనతో కైలాస్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

మంగళవారం తెల్లవారుజామున కళ్యాణి గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని పంట పొలంలో పాతిపెట్టి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతదేహాన్ని నాలుగు గంటల్లోపే దహనం చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో కైలాస్ నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు