కార్తీక దీపం వివాదం.. అధికారులపై ధిక్కార పిటిషన్

26-11-2026 | 12:29pm

న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం(Karthigai Deepam Issue) మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు దీపథూన్ వద్ద కార్తీక దీపం వెలిగించలేదంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపథూన్ వద్ద నవంబర్ 24న కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నవంబర్ 20న ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే నిర్ణీత రోజున అక్కడ దీపం వెలగకపోవడంతో వివాదం మొదలైంది. సంప్రదాయంగా దీపం వెలిగించే మరో ప్రాంతంలోనే కార్యక్రమం నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో మదురై జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ(Madurai Collector Nishant Krishna), పోలీస్ కమిషనర్ ఎస్. రాజేందిరన్, హిందూ మత, ధర్మాదాయ శాఖ కమిషనర్ టి.జి. వినయ్, ఆలయ కార్యనిర్వాహక అధికారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని పిటిషనర్ ఆరోపించారు.

మరోవైపు, దీపథూన్(Deepathoon) వద్ద దీపం వెలిగించలేకపోవడంపై మదురై కలెక్టర్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించి క్షమాపణ కోరినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆలయ ట్రస్టీలు దీపారాధన కోసం ప్రతిపాదించిన బృందానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆదేశాలను అమలు చేయలేకపోయామని జిల్లా యంత్రాంగం వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారంపై పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో తిరుపరంకుండ్రం దీపం వివాదంలో తదుపరి న్యాయస్థాన నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు