తిమ్మాజిపేట రెవెన్యూ శాఖలో అవినీతి లీలలు!

10-10-2026 | 05:20am
  1. బతికుండగానే వారసులెవరూ లేరని వేరొకరి పేర పట్టా మార్పిడికి యత్నం
  2. అధికారులతో చేతులు కలిపిన పైరవీ‘కారు’
  3. ఆలస్యంగా తేరుకున్న బాధితులు
  4. బతికే ఉన్నాం విరాసత్ చేయాలంటూ కలెక్టర్‌ను ఆశ్రయించిన వారసులు

నాగర్ కర్నూల్ అక్టోబర్ 9 (విజయక్రాంతి) సారూ.. మేమింకా బతికే ఉన్నాం.! తాతల కాలంనాటి ప్రభుత్వ భూమిని(Government land) మా పేర విరాసత్ చేయాలంటూ నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామానికి చెందిన జుట్టు చెన్నయ్య @ చిన్న రాయుడు వారసులు జుట్టు స్వామి, జుట్టు కృష్ణయ్య, జుట్టు చంద్రబాబులు శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో(District Collector's Office) ఫిర్యాదు చేశారు.

’నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయ్’ అన్న చందంగా గ్రామానికి చెందిన ఓ కారు పార్టీ లీడర్ ను నమ్మి విరాసత్ కోసం తాసిల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించగా కొనుగోలు చేసిన పట్టా భూములను విరాసత్ చేయించి వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ భూమిని మాత్రం నొక్కేందుకు యత్నించాడు. కొన్నాళ్లకు ఆ వ్యక్తికి వారసులే లేరంటూ నకిలీ ధృవపత్రాలు సృష్టించి తన పేర రాయించుకోవాలని దుర్బుద్ధి ప్రదర్శించాడు. కొన్నేళ్లపాటు బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఆ కుటుంబం ఈమధ్య తిరిగి సొంత ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేస్తున్నందుకు సిద్ధమాయ్యారు.

కానీ కారు పార్టీ లీడర్ తమ భూమిని కబ్జా చేసుకుని ఆ భూమి తమదే నంటూ దౌర్జన్యం చేయడంతో మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించారు. చివరికి బ్రతికుండగానే వారసులే లేరంటూ అధికారులతో చేతులు కలిపి ఆర్‌ఐ రిపోర్టు కూడా తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తు ఆ భూమి హక్కుదారుడైన జుట్టు చిన్న రాయుడు పేరే నమోదయి ఉండడంతో ప్రస్తుతం వారసులు తాము బ్రతికే ఉన్నామంటూ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. 

 రెవెన్యూ అధికారులతో చేతులు కలిపిన కారు పార్టీ లీడర్.!

 గ్రామానికి చెందిన మిద్దె రాములు అనే వ్యక్తి గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. గ్రామానికి చెందిన జుట్టు చిన్న రాయుడు 2014 జూన్ 3న అనారోగ్యంతో మృతి చెందాడు. మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న అనంతరం విరాసత్ కోసం వారసులు గ్రామానికి చెందిన కారు పార్టీ లీడర్ సహాయంతో 2018 జూలై 10న తిమ్మాజిపేట తాసిల్దార్ కి దరఖాస్తు చేసుకున్నారు.

సర్వే నెంబర్ 144/ఇ లో 25 గుంటలు, 152 /ఇలో 9 గుంటల పట్టా భూమితో పాటు అదే శివారులోని 454/35లో 35 గుంటల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉన్నది. విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్న క్రమంలో అప్పటి తహసిల్దార్ ఇతర రెవెన్యూ అధికారులతో చేతులు కలిపిన సదరు పైరవీకారు ప్రభుత్వ భూమిని విరాసత్ చేయకుండా నొక్కి పట్టి 2019 నవంబర్ 10న ఫైల్ నెంబర్ ఏ1803/2019 ద్వారా జుట్టు చెన్నయ్య చిన్నరాయుడుకు వారసులే లేరంటూ రాజీనామా తేదీ 2019 అక్టోబర్ 26, నోటీసు ఇచ్చినట్లుగా 2019 సెప్టెంబర్ 12 తేదీలతో కూడిన అక్రమ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిపోర్టు ఇచ్చినట్లుగా రికార్డు సృష్టించారు.

ఆలస్యంగా తేరుకున్న బాధితులు ఫ్యామిలీ దృవపత్రాన్ని పొందుపరిచి విరాసత్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మిద్దె రాములు ఆ భూమి తమదేనంటూ సదరు వ్యక్తుల నుండి కొనుగోలు చేసినట్లు చెప్తుండడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ప్రస్తుత రెవెన్యూ అధికారులు కూడా పైరవీకారం కే మద్దతు తెలుపు తున్నట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ప్రస్తుత తాసిల్దార్ జయంతిని వివరణ కోరగా విచారణ అనంతరం నివేదిక కొరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు