D4 కాలువ నీటి కోసం రైతుల ధర్నా

22-11-2026 | 09:18pm

కొల్లాపూర్, నవంబర్ 22: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం, ఎన్నంబెట్ల, మాచినేనిపల్లి, చౌటబెట్ల గ్రామాల రైతులు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి D4 కాలువ ద్వారా సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలంలో ప్రస్తుతం 40 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, తాగునీటి అవసరాలకు 9 టీఎంసీలు సరిపోతాయని తెలిపారు. మిగిలిన 31 టీఎంసీల నీరు ఆవిరైపోతుందని ఆయన ఆరోపించారు. వరి పంటలు చివరి దశలో ఉన్నాయని, మరో ఒకటి రెండు తడుల సాగునీరు అందిస్తే రైతులు తమ పంటలను కాపాడుకుంటారని పేర్కొన్నారు.

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో D4 కాలువలో జమ్ము, పూడిక తొలగించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆంధ్ర ప్రాంతంలోని కుప్పంకు నీరు వెళ్తున్నప్పటికీ, కృష్ణానది పక్కనే ఉన్న కొల్లాపూర్ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని, ఇందుకు మంత్రి జూపల్లి నిర్లక్ష్యమే కారణమని బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

రైతులకు సాగునీరు(Supply Water) అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తే రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి విడుదల(Water Release) చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాచినేనిపల్లి గ్రామ సర్పంచ్ చంద్రయ్య, కొల్లాపూర్ మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, తిరుపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు