రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం కొరత!

16-10-2026 | 12:10pm

3,774 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కల్లో తేడా

మిల్లు యజమాని సహా పలువురిపై కేసు నమోదు

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మంతటి చౌరస్తా సమీపంలో ఉన్న మహాలక్ష్మి పార్బాయిల్డ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్టోబర్ 15న పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, రికార్డులు, ధాన్యం నిల్వలను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో 3,774.818 మెట్రిక్ టన్నుల ధాన్యం, అంటే 94,370 బస్తాలకు సంబంధించిన కొరత ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు ధాన్యం నిల్వలు, అధికారిక రికార్డుల మధ్య తేడాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ దండు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకుతోట సాయిబాబు, సుదర్శన్‌తో పాటు మరికొందరిపై నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2022-23, 2024-25, 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో కొరత ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

కస్టమ్ మిల్లింగ్ కోసం అప్పగించిన ప్రభుత్వ ధాన్యం దారి మళ్లించారా? నిధులు లేదా ధాన్యం దుర్వినియోగం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో గుర్తించిన ధాన్యం కొరతకు గల కారణాలు, బాధ్యుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, ధాన్యం కొరతకు గల కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయితేనే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు