భవనం కొత్తది.. సేవలు పాతవే..!

08-10-2026 | 05:15am
  1. మెడిసిన్ కోసం గంటల తరబడి బారులు
  2. నో స్కానింగ్.. ఓన్లీ ఎక్స్‌రే, ఈసీజీనే..         
  3. పూర్తిస్థాయిలో లేని వైద్యులు
  4. గంపెడాశాలతో వస్తున్న రోగులు
  5. నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలకు సుస్తీ

నల్లగొండ టౌన్, అక్టోబర్ 7: కోటి ఆశలతో ప్రారంభమైన నకిరేకల్ ఏరియా ఆస్పత్రి(Nakrekal Area Hospital) వైద్య సేవలకు(Medical services) సుస్తీ చేసింది. సర్కార్ ఆస్పత్రి అంటేనే సగం.. సగం సేవలు అన్న చందంగా మారింది. రూ.కోట్లు వెచ్చించి నిర్మించినా ఏరియా ఆస్పత్రి భవనం(Area Hospital building) మాత్ర మే కొత్తది. సేవలు మాత్రం పాతవే. 100 పడకల సామర్థ్యంతో ఇటీవల ప్రారంభమైన ఆస్పత్రిలో వైద్య సేవలు 30 పడకల ఆస్పత్రిని మించడం లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించడంతో ఇక్కడి ఆస్పత్రికి మస్తు హైప్ క్రియేట్ అయ్యింది.

దీంతో నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రజలు కోటి ఆశలతో ఏరియా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆస్పత్రికి వచ్చిన రోగుల బాగోగులు పట్టించుకోవడంలో ఇక్కడి యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యిందనే చెప్పాలి. అరకొర వైద్య సేవలతో రోగులను మమ అన్పించి ఇంటికి తిప్పి పంపుతున్నారు. దీంతో రోగులు బాహాటంగానే వైద్య సేవలపై పెదవి విరుస్తుండడం కొసమెరుపు.

మెడిసిన్ కోసం గంటల తరబడి క్యూలో..

నకిరేకల్ ఏరియా ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. కానీ అక్కడి సౌకర్యాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రి భవనం కొత్తది కావడంతో మెరుగైన వైద్య సేవలు అందుతాయని భావించి అంతా నకిరేకల్ ఏరియా ఆస్పత్రి బాటపడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన వారికి ఛీత్కారాలు, చీదరింపులే ఎదురవుతున్నాయి. ఓపీ పేషంట్లు అయినా.. ఇన్ పేషంట్లు అయినా.. మెడిసిన్ కోసం గంటల తరబడి క్యూలైన్లలోనే ఎదురుచూడాల్సి వస్తుంది. నిజానికి మెడిసిన్ కోసం మూడు నాలుగు కౌంటర్లు ఉన్నప్పటికీ ఒక్కరు మాత్రమే మెడిసిన్ ఇస్తుండడంతో పేషంట్లు క్యూలో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదిలావుంటే.. ఇక్కడికి వస్తున్న పేషంట్లలో సగం మందికి మెడిసిన్ బయట కొనుక్కోవాలని చెబుతుండడం పలు విమర్శలకు దారితీస్తోంది.

సిబ్బంది దురుసు ప్రవర్తన..

నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇక్కడ ఓపీ రాయించుకునే విభాగం దగ్గరి నుంచి మెడిసిన్, ఎక్స్ రే, ఈసీజీ విభాగాలతో పాటు ఆఖరికి కొంతమంది వైద్యులు సైతం రోగులను మంచిగా రిసీవ్ చేసుకోవడం లేదు. టెస్టుల కోసం ల్యాబ్ దగ్గరికి వెళితే.. అక్కడ రోగులతో ప్రవర్తించే తీరు దారుణమని చెప్పాలి. మీరు వస్తున్నారని.. మేం అన్ని ఎదురుగా పట్టుకుని కూర్చోవాలా..? మాకేం పైసలియ్యట్లే.. అంత ఓపిక లేకపోతే ప్రైవేటు ఆస్పత్రికి పోండి. ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీయోద్దంటూ రోగులను సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తుండడంపై పేషంట్లు కలత చెందుతున్నారు. ఇదిలావుంటే.. కొంతమంది డాక్టర్లు ఓపీ కోసం వచ్చిన పేషంట్లను కనీసం నాడీ పట్టి చూసే పరిస్థితి లేదు. వచ్చిన రోగితో ఏం అయ్యింది..? అని అడగడం.. వారు చెప్పే సమాధానం విని నాలుగు రకాల మెడిసిన్ రాసి పంపడం తప్ప ఫీల్ గుడ్ తరహాలో డీల్ చేసే పరిస్థితి లేదు.

అందుబాటులో లేని స్కానింగ్

నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు స్కానింగ్కు దిక్కు లేదు. కేవలం ఎక్స్ రే, ఈసీజీ మినహా మిగతా రేడియాలజీకి సంబంధించిన ఏ సేవలు అందుబాటులో లేవు. ఆఖరికి వైద్యులు సైతం పూర్తిస్థాయిలో లేరు. ఆస్పత్రిలో మాత్రం ఒక్కో స్పెషలిస్ట్ డాక్టర్కు ఒక్కో గదిపై పేర్లు రాయడం మినహా.. గదుల్లో వైద్యులు ఉండే పరిస్థితి లేదు. కనీసం ఎముకల వైద్యుల నిపుణులు లేకపోవడం.. జనరల్ ఫీజియషన్తోనే కాలం నెట్టుకొస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఆ జనరల్ ఫీజిషియన్ డాక్టర్ సైతం మధ్యాహ్నాం టైమ్కు సొంత క్లీనిక్ బాటపడుతుందనే విమర్శలు లేకపోలేదు. 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటైన నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో స్కానింగ్కు దిక్కు లేకపోవడం వల్ల ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు