మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి..
ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పంచాయతీ కార్యాలయాల ప్రారంభోత్సవం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని, పట్టణంలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అధికారులను ఆదేశించారు.
అవసరమైతే ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు.మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా పట్టణంలోని పలు గల్లీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా 1, 2, 3వ వార్డుల్లో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా తదితర సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు అడ్డంకులు ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే.. వాటిని వెంటనే తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా మారి డెంగ్యూ వంటి విషజ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలుగుతామని అన్నారు. ప్రస్తుతం ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే డ్రైనేజీ కనెక్టివిటీ, చెత్త సేకరణ, చెత్త డంపింగ్ యార్డు, చిట్యాల రోడ్డులోని మహాప్రస్థానంలో అవసరమైన మౌలిక సదుపాయాలపై స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పట్టణ భౌగోళిక స్థాయిలను అంచనా వేసి సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
పంచాయతీ భవనాలు ప్రారంభం
అనంతరం మండలంలోని గంగోరిగూడెం, బీరెల్లిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను, మహిళా సమాఖ్య భవనాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.