వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి
జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు
ములుగు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): 2026–27 సీజన్‌లో జిల్లాలోని రైతుల నుంచి వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు (District Collector Borkade Hemant Sahadevrao) అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జితో కలిసి కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 135 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. నిబంధనలకు లోబడి మాత్రమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం గుర్తించిన 7 సన్న రకాల ధాన్యానికి మాత్రమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఎ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 2 వేల 461 రూపాయలు, సి గ్రేడ్ ధాన్యానికి 2 వేల 441 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రము వద్ద నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర సూచించే ప్రత్యేక బ్యానర్ ను ప్రదర్శించాలని తెలిపారు.
ధాన్యాన్ని తెచ్చిన రైతుల వివరాలను వెంటనే ప్రత్యేక రిజిష్టరులో వ్రాసి, ధాన్యాన్ని తెచ్చిన దినము నుండి ప్రతిదినము తేమ కనిష్ట స్థాయి 17 శాతం వచ్చేవరకు పరిశీలించి రోజువారీగా రిజిష్టరులో నమోదు చేయాలని సూచించారు. ధాన్యాన్ని తూకం వేయించే విషయంలో ఎటువంటి అక్రమాలకు, వరుసక్రమ ఉల్లంఘనలకు,
తేమరాని ధాన్యాన్ని తూకం వేయడం అవకతవకలకు పాల్పడకుండా సెంటర్ నిర్వహించుటకు భాద్యత వహించాలని, కేంద్ర నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసువంటి తీవ్ర చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే టాబ్ లో నమోదు చేయాలని, తదుపరి వివరములన్ని అచ్చువేసిన రిజిస్టర్ లో నమోదు చేయలన్నారు.
ధాన్యం రవాణా కోసం జీపీఎస్ పరికరం అమర్చిన వాహనాలను మాత్రమే ఉపయెగించాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు, ఆలస్యం కలగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఎస్పి రవీందర్, డిఆర్డిఓ రవీందర్, డిసిఓ రామ్ మోహన్, డిఎఓ సురేష్ కుమార్, డిహెచ్ ఓ సంజీవరావు, డిఎం, డిసిఎస్ఓ కృష్ణవేణి, జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్, సంబంధిత అధికారులు, ఐకెపి, పిఏసిఎస్, జిసిసి, ఎంఎసిసి సెంటర్ల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.