ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణకు ఈసీ రెడీ!
దేశంలోని ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ (Special Summary Revision) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) వెల్లడించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఈ ప్రక్రియకు అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది.
ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. జాబితాలో పారదర్శకత పెంచడంతో పాటు అర్హులైన ఓటర్లందరికీ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా, ఫారం-6, ఫారం-8లో ఆధార్ వివరాలు (Aadhaar Details) సమర్పించడం పూర్తిగా స్వచ్ఛందమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ వివరాలు ఇవ్వలేదనే కారణంతో ఎలాంటి దరఖాస్తును తిరస్కరించకూడదని తేల్చిచెప్పింది. అలాగే ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తుల పేర్లను తొలగించకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.