వివాదానికి తెర.. వెలిగిన తిరుప్పరన్‌కుండ్రం దీపం

28-11-2026 | 05:28pm

తమిళనాడు: కొన్నేళ్లుగా వివాదానికి కేంద్రంగా మారిన తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండ(Thirupparankundram Hill)పై కార్తిక మహాదీపం(Karthigai Deepam) ఎట్టకేలకు వెలిగింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల నేపథ్యంలో శనివారం (నవంబర్ 28) సాయంత్రం దీపథూన్‌గా పిలిచే పురాతన రాతిస్తంభంపై ఆలయ పూజారులు జ్యోతిని వెలిగించారు. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్తిబన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ, ఇతర అధికారుల సమక్షంలో పూజారులు సంప్రదాయబద్ధంగా దీపాన్ని వెలిగించారు. గతంలో ఉచ్చిపిళ్లైయార్ ఆలయ మండపం(Uchi Pillaiyar Temple Mandapam)పై వెలిగించిన జ్యోతి నుంచే పవిత్రాగ్నిని తీసుకొచ్చి రాతిస్తంభంపై మహాదీపాన్ని వెలిగించారు. దీపోత్సవం నేపథ్యంలో తిరుప్పరన్‌కుండ్రం కొండపై భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలు భద్రతా బాధ్యతలు చేపట్టాయి. దర్గా పరిసరాల్లో 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధనలను అమలు చేశారు. కొండపైకి వెళ్లేందుకు భక్తుల సంఖ్యపై ఆంక్షలు విధించడంతో పరిమిత సంఖ్యలోనే ప్రజలకు అనుమతి లభించింది.

తిరుప్పరన్‌కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి(Thirupparankundram Subrahmanya Swamy Temple) చెందిన కొండపై ఉన్న దీపథూన్ రాతిస్తంభంపై కార్తిక దీపం వెలిగించాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉంది. దాని సమీపంలోనే సిక్కందర్ దర్గా ఉండటంతో దీపం వెలిగించే సంప్రదాయం, స్థలానికి సంబంధించిన హక్కులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సంప్రదాయంగా ఉచ్చిపిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగిస్తూ వస్తున్నారు. అయితే రాతిస్తంభంపైనా దీపం వెలిగించాలంటూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం గతంలో అనుకూల ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఈ ఏడాదికి మాత్రమే రాతిస్తంభంపై కార్తిక దీపం వెలిగించేందుకు మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే నవంబర్ 24న పండుగ సందర్భంగా సంప్రదాయ మండపంపైనే దీపం వెలిగించడంతో న్యాయస్థానం ఆదేశాల అమలుపై వివాదం తలెత్తింది. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 27న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆలయ పాలకమండలి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను ఆలయ నిర్వహణ బాధ్యతల కోసం నియమించింది. కొండపై భద్రతను సీఆర్పీఎఫ్‌కు అప్పగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం దీపథూన్‌పై కార్తిక మహాదీపం వెలిగించారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం భవిష్యత్తులో అక్కడ దీపం వెలిగించే హక్కులపై తుది నిర్ణయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


మరిన్ని వార్తలు