కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3% పెంపు
- దీపావళి కానుకగా క్యాబినెట్ తీపికబురు
- డీఆర్ కూడా 3 శాతం పెంచుతూ నిర్ణయం
- ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు
- 1.16 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
- ఖజానాపై రూ.10కోట్లకుపైగా అదనపు భారం
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. డీఏ, డీఆర్‌ను 3 శాతం పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 1.16 కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(Union Minister Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు.
తాజా పెంపుతో ఇప్పటివరకు ఉన్న 60శాతం డీఏ 63 శాతానికి చేరింది. ఆరునెలలకోసారి ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను ప్రభుత్వం పెంచుతూ ఉంటుంది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.71 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.10,016.10 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కేంద్ర ఏడో పే కమిషన్ సిఫారసు మేరకు డీఏ, డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.