మోదీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: రాహుల్
నా ఫోన్లోనే ఆధారాలున్నాయి.. మోదీకి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తన ఫోన్లోనే ప్రధానికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతూ, మోదీతో నేరుగా ముఖాముఖి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య Debate జరిగితే మోదీ ప్రధానిగా కొనసాగలేరని రాహుల్ వ్యాఖ్యానించారు. శుక్రవారం Instagramలో నిర్వహించిన ‘Ask Me’ సెషన్లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను చూపిస్తూ అందులోనే కీలక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అందుకే ప్రజల ముందే నేరుగా చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మైక్ కట్ చేస్తున్నారు.. అందుకే బయట చర్చ!
పార్లమెంట్‌లోనే చర్చించవచ్చని బీజేపీ చెబుతున్నప్పుడు ప్రత్యేకంగా Public Debate ఎందుకు కోరుకుంటున్నారనే ప్రశ్నకు రాహుల్ స్పందించారు. లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రసంగించే సమయంలో మైక్రోఫోన్ కూడా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ ఆరోపణలు, SIR ప్రక్రియ, చైనా అంశం, జనరల్ నరవణె పుస్తకం, ఎప్స్టీన్ వ్యవహారంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. సుదీర్ఘ ప్రసంగాలతో కాకుండా ఇద్దరు నేతల మధ్య నేరుగా ప్రశ్నలు, సమాధానాలతో చర్చ జరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఒకవైపు మోదీ.. మరోవైపు రాహుల్.. మధ్యలో టేబుల్!
మోదీతో చర్చ ఎలా ఉండాలో కూడా రాహుల్ వివరించారు. ప్రధాని తనపై ఆరోపణలు చేయాలని, తాను మోదీపై ప్రశ్నలు సంధిస్తానని అన్నారు. ఇద్దరి మధ్య ఒక టేబుల్ ఉండాలని, ఒకవైపు మోదీ, మరోవైపు తాను కూర్చుని ముఖాముఖి చర్చించాలని ప్రతిపాదించారు. ఈ Debateకు Adjudicatorగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ లేదా RSS చీఫ్ మోహన్ భగవత్‌ను నియమించినా తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. పార్లమెంట్లో చర్చించేందుకు అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ అక్కడ చర్చకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. దీంతో మోదీతో ముఖాముఖి చర్చ అంశం మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య Political Warకు దారితీసింది. రాహుల్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి ఆధారాలు వెల్లడయ్యాయనే విషయం మాత్రం స్పష్టతకు రావాల్సి ఉంది.