జ్ఞానేశ్ జైలుకు వెళ్లడం పక్కా

02-11-2026 | 05:25am
  1. మోదీ, అమిత్ షాపైనా పోరాటం
  2. 2024 ఎన్నికల్లోనూ చట్టవిరుద్ధంగా విజయం
  3. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, నవంబర్ 1: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ)(Chief Election Commissioner of India) జ్ఞానేశ్‌కుమార్ దిగిపోక తప్పదని, ఆయన జైలుకూ వెళ్లడం పక్కా అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. జ్ఞానేశ్ తర్వాత తమ పోరాటం మోదీ, అమిత్ షాపైనేనని తేల్చిచెప్పారు. ఓట్ల దొంగలను వదిలిపెట్టబోమన్నారు. ‘ఓట్ చోరీకి పాల్పడ్డవాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరు.

ముందుగా జ్ఞానేశ్.. ఆ తర్వాత మోదీ, అమిత్ షా వంతే. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ఎవరూ తప్పించుకోలేరు. మోదీ, అమిత్ షా పారిపోవాలని చూసినా ఈ దేశ ప్రజలు వదిలిపెట్టబోరు’ అని ఆయన హెచ్చరించారు. రామ్‌లీలా మైదాన్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. 

3శాతం ఓట్ల తేడా వెనుక మతలబేంది?

భారత దేశ ఆత్మను, ప్రజల గొంతును చంపేందుకు మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్ కలిసి భారీ కుట్ర పన్నారని.. 2024 ఎన్నికల్లోనూ ఓట్ల చోరీతోనే అధికారంలోకి వచ్చారని రాహుల్  ఆరోపించారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నా.. ఎంత ఎత్తులో ఉన్నామని మురిసిపోయినా.. అందరం రాజ్యాంగం ముందు చిన్నవాళ్లేనని తెలిపారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని మోదీ, అమిత్ షా చూస్తున్నారని.. అలాంటి వాళ్లను ప్రజలు విడిచిపెట్టబోరని హెచ్చరించారు. ‘జ్ఞానేశ్‌కుమార్ పదవి నుంచి దిగిపోవాల్సిందే. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపాల్సింది. ఆ టైమ్ త్వరలోనే వస్తుంది. ఆ తర్వాత మోదీ, అమిత్ షాపై పోరాడుతాం. ఎవరూ తప్పించుకోలేరు’ అని తెలిపారు.

మోదీ తప్పించుకోవడం లేదని అమిత్ షా అంటున్నారని.. అయితే మోదీ వెళ్లాలనుకున్నా తాము వెళ్లనివ్వబోమని ఆయన అన్నారు. ‘మోదీజీ, అమిత్ షాజీ.. కాస్కోండి. జ్ఞానేశ్‌కుమార్ తర్వాత మీపైనే మా పోరాటం. మీరు చేసిన ఓటు చోరీకి చట్టపరమైన చర్యలు తప్పవు’ అని మండిపడ్డారు. ‘జ్ఞానేశ్‌కుమార్ చేసింది సాధారణ ద్రోహం కాదు.. దేశద్రోహం, రాజద్రోహం.

ఓట్ల చోరీని ఆయన ముందుండి నడిపించారు. ఆయన ఆ పనిచేయకపోతే ఇప్పుడు ప్రధానిగా మోదీ, హోంమంత్రిగా అమిత్ షా ఉండేవారు కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా, ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం ద్వారా ఓట్ల చోరీకి పాల్పడ్డారు. ఆ ఎన్నికల తర్వాత 13.50 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.

అంటే.. మొత్తం ఓటర్లలో 15 శాతం మంది ఓటర్లను తీసేశారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయేకు, ఇండీ కూటమికి మధ్య వచ్చిన ఓట్ల తేడా మూడు శాతమే. చట్టవిరుద్ధంగా ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఇది మేం చెప్పడం లేదు.. ఎన్నికల సంఘం లెక్కలే చెప్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. 

ఇద్దరు ముగ్గురి చేతుల్లో దేశ సంపద..

దేశ సంపదను ఇద్దరు ముగ్గురి చేతుల్లో మోదీ సర్కార్ తాకట్టు పెట్టిందని.. అందులో అంబానీ, అదానీ బాగుపడితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆ ఇద్దరు ముగ్గురు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ.. పేదల లోన్లను మాత్రం ఒక్క ఈఎంఐ కట్టకపోయినా జైల్లో వేస్తున్నదని దుయ్యబట్టారు. ‘అంబానీ, అదానీ ఆమ్దానీ బాగుంటే చాలన్నదీ మోదీ ఆలోచన. విద్య, వైద్యం, ట్రాన్స్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్, విద్యుత్.. ఇలా అన్ని సంస్థలను వారికి ధారాదత్తం చేస్తున్నారు’ అని ఆరోపించారు.

అన్ని వ్యవస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యం పెరిగిపోయిందని.. ప్రశ్నించేవాళ్లపైకి ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ బద్ధ సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ‘ఆ ఇద్దరు ముగ్గురి ఆస్తులు లెక్కలేనంతగా పెరిగిపోయాయి. దేశ యువతకు మాత్రం ఉద్యోగాల్లేవ్.. రైతులు పండించి పంటకు గిట్టుబాటు దక్కడం లేదు’ అని అన్నారు. 

ప్రేమే మా తత్వం 

దేశాన్ని, దేశంలోని ప్రతి ఒక్కరిని ప్రేమించడమే తమ తత్వమని.. ఏ ఒక్కరినీ ద్వేషించబోమని రాహుల్ గాంధీ తెలిపారు. ‘మాకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరు.. ఉండరు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్‌ను కూడా మేం ప్రేమిస్తాం. వారు చేస్తున్న మోసాలకు మాత్రం శిక్ష పడాల్సిందే. ప్రేమే మా తత్వం.. అహింసే మా మార్గం. విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని’ అని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయాలని బీజేపీ చూస్తున్నదని, వాటిని కాపాడుకోవడమే తమ లక్ష్యమని రాహుల్ తెలిపారు.  ‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం కానివ్వబోం. ప్రశ్నించే ప్రజల గొంతులను మూగబోనివ్వం. ఎంత అధికారం, డబ్బు ఉన్నా రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదు’ అని పేర్కొన్నారు. ‘శివతాండవంలో ఎవరైనా పాల్గొనవచ్చు. చిన్నా పెద్ద అనే తేడా ఉండదు. అలాంటి దేశాన్ని మేం కోరుకుంటున్నాం. ప్రేమను పంచే దేశం కావాలి’ అని ఆయన తెలిపారు.  

వాళ్లను రాముడూ క్షమించడు: అఖిలేశ్

బీజేపీ నేతలను శ్రీరాముడు కూడా క్షమించబోడని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘ఓట్ చోరీకి తెగబడ్డారు. చందా చోరీకి పాల్పడ్డారు. శ్రీరాముడు కూడా వాళ్లను క్షమించడు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఉత్తరప్రదేశ్‌లో ఊదరగొట్టారు.. ప్రజలు వాళ్లను మొన్న వారణాసి ఎన్నికల్లో డబుల్ జీరో చేశారు. ఇక కేంద్రంలోనూ జరగబోయేది అదే’ అని పేర్కొన్నారు.

అయోధ్య విరాళాల కుంభకోణాన్ని ఆయన ప్రస్తావిస్తూ చందా చోరీకి బీజేపీ పాల్పడిందని దుయ్యబట్టారు. ‘బీజేపీ నేతలు మాత్రమే ఈ దేశంలో పౌరులుగా, ఓటర్లుగా ఉండాలన్నది ఆ పార్టీ ఉద్దేశం. ఇతరులకు ఓటు హక్కు ఉండొద్దని కుట్రలు చేస్తున్నది’ అని మండిపడ్డారు. యూపీలో కూడా హిందువుల ఓట్లు పోయాయని ఇప్పుడు అక్కడి బీజేపీ నేతలే అంటున్నారని.. దీన్ని బట్టి ఓట్ చోరీ జరిగిందో లేదో వాళ్లే చెప్పాలని అన్నారు. 

మరిన్ని వార్తలు