పదవిలో ఉన్నా.. రిటైరైనా రక్షణేనా?

04-11-2026 | 05:54pm

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్లకు కల్పించిన చట్టపరమైన రక్షణ ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. అధికారిక విధుల నిర్వహణకు సంబంధించి వారిపై సివిల్, క్రిమినల్ కేసులు కొనసాగించకుండా అడ్డుకునే 2023 చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

2023లో తీసుకొచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం.. సీఈసీ లేదా ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, గతంలో ఆ పదవిలో ఉన్న వ్యక్తి అధికారిక విధుల నిర్వహణలో చేసిన చర్యలు లేదా మాట్లాడిన మాటలకు సంబంధించి కోర్టులు సివిల్, క్రిమినల్ కేసులను స్వీకరించకూడదు. ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను కూడా కొనసాగించడానికి వీల్లేదని ఈ నిబంధన పేర్కొంటోంది. ఈ రక్షణ పదవీ విరమణ తర్వాత కూడా వర్తిస్తుంది.

ఈ నిబంధన ఎన్నికల కమిషనర్లకు అవసరానికి మించి రక్షణ కల్పిస్తోందని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక విధుల పేరుతో దురుద్దేశపూర్వకంగా వ్యవహరించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా బాధితులకు న్యాయపరమైన పరిష్కారం దొరకని పరిస్థితి ఏర్పడుతుందని వాదిస్తున్నారు. ఈ నిబంధన రాజ్యాంగంలోని 14, 21వ అధికరణాలకు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటున్నారు.

ఓటరు జాబితా నుంచి అర్హులైన వారి పేర్లు తొలగించడం, ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు అన్యాయం జరగడం లేదా ఎన్నికల సంఘం పనితీరుపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో బాధితులకు న్యాయపరమైన మార్గాలు పరిమితమవుతాయని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడానికి రక్షణ అవసరమే అయినా, అది చట్టపరమైన జవాబుదారీతనాన్ని పూర్తిగా తొలగించే స్థాయిలో ఉండకూడదని వాదించారు.

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయవాది అరుణ్ కుమార్ అగర్వాల్‌తో పాటు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా దాఖలు చేసిన పిటిషన్లలోని అంశాలను పరిశీలించింది. సెక్షన్ 16ను చట్టంలో చేర్చడానికి గల కారణాలు, దాని అవసరం, రాజ్యాంగబద్ధతపై కేంద్రం, ఎన్నికల సంఘం తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆదేశించింది.

2023లో ప్రవేశపెట్టిన అసలు బిల్లులో ఎన్నికల కమిషనర్లకు ఈ తరహా విస్తృత రక్షణ కల్పించే నిబంధన లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అనంతరం సవరణ ద్వారా సెక్షన్ 16ను చేర్చారని, అందుకు తగిన వివరణ ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌లో ఉన్న సమయంలో ఈ నిబంధనతో కూడిన బిల్లు ఆమోదం పొందిన అంశాన్ని కూడా తమ వాదనల్లో ప్రస్తావించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కేంద్రం, ఎన్నికల సంఘం సమర్పించే సమాధానాలు కీలకం కానున్నాయి. సెక్షన్ 16 కొనసాగింపుపై తుది నిర్ణయం మాత్రం న్యాయస్థానం విచారణ అనంతరమే వెలువడనుంది.

మరిన్ని వార్తలు