ఆల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి, నవంబర్ 04 (విజయక్రాంతి): కరీంనగర్లోని జిల్లా సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలలో మొత్తం 69 ప్రాజెక్టులు ప్రదర్శించగా, వాటిలో కేవలం 5 ప్రాజెక్టులు మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ఈ ఐదు ప్రాజెక్టులలో కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్(Alphores E-Techno School)కు చెందిన రెండు ప్రాజెక్టులు ఎంపిక కావడం జరిగింది.
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశ్యం 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పాఠశాల విద్యార్థులతో పాటు పాఠశాల విద్యకు దూరంగా ఉన్న బాలబాలికల్లో కూడా శాస్త్రీయ ఆలోచనా దృక్పథం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడం. మొదటి ప్రాజెక్ట్ ఆరోగ్యం మరియు పరిశుభ్రత అనే అంశంపై రూపొందించిన 'సాని నెస్ట్' ప్రాజెక్టును 9వ తరగతి విద్యార్థిని వేద్య శ్రీ, 8వ తరగతి విద్యార్థిని దీక్షాశ్రీ ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.రెండవ ప్రాజెక్ట్ వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై వంటగదిలో మిగిలిపోయే వ్యర్థ పదార్థాలను ఉపయోగించి రూపొందించిన 'క్లీనర్ ఫ్రమ్ కిచెన్ వేస్ట్' ప్రాజెక్టును 8వ తరగతి విద్యార్థిని పి. శ్రేష్ఠ, 9వ తరగతి విద్యార్థిని కె. లాస్యశ్రీ ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి జిల్లా స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపి, తదుపరి మాట్లాడుతూ విద్యార్థుల పరిశోధనా ఆసక్తికి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి అల్ఫోర్స్ విద్యాసంస్థలు అందిస్తున్న నూతన విద్యా విధానాలకు నిదర్శనంగా నిలుస్తోందని, రాబోయే రాష్ట్రస్థాయి పోటీలలో కూడా విద్యార్థులు మరింత ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.