రాహుల్ భేటీకి సిద్ధరామయ్య డుమ్మా.. కర్ణాటకలో హాట్ టాపిక్!

06-11-2026 | 04:01pm

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహించిన కీలక సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) గైర్హాజరయ్యారు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో భేటీకి హాజరుకాలేనని పార్టీ నాయకత్వానికి తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.

రాహుల్ గాంధీ సమావేశానికి దూరంగా ఉన్న సిద్ధరామయ్య షెడ్యూల్ ప్రకారం హాసన్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ హసనాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోనున్నారు. హొయసలుల కాలం నాటి చారిత్రక ఆలయం అక్టోబర్ 29న భక్తుల దర్శనార్థం తెరుచుకోగా, నవంబర్ 11న ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇదిలా ఉండగా, సిద్ధరామయ్యకు సంబంధించినదిగా ప్రచారమైన నకిలీ స్టింగ్ ఆపరేషన్ వీడియో (Fake Sting Operation Video) వ్యవహారం ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 3న ఢిల్లీలో రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ నిర్వహించిన సమావేశానికి ఆయన దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

మరోవైపు సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని ప్రచారంలోకి వచ్చిన స్టింగ్ వీడియోపై బెంగళూరు పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. వీడియోలో చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కల్పితమైనవని, ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కథనంగా ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు వెల్లడించారు. వీడియోలో కనిపించిన వ్యక్తులను విచారించడంతో పాటు వారి వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించినట్లు తెలిపారు.

ఈ వీడియోను ఎవరు రూపొందించారు? ఎలా చిత్రీకరించారు? ఎవరి ద్వారా సామాజిక మాధ్యమాల్లోకి చేరింది? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

ఒకవైపు రాహుల్ గాంధీ సమావేశానికి సిద్ధరామయ్య గైర్హాజరు కావడం, మరోవైపు స్టింగ్ వీడియోపై పోలీసుల ప్రాథమిక ప్రకటన వెలువడటం కర్ణాటక రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అయితే ముందుగా నిర్ణయించిన పర్యటన కారణంగానే సమావేశానికి హాజరుకాలేదని సిద్ధరామయ్య వర్గం చెబుతోంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా స్పందిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు