అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేసిన ఎమ్మెల్యే

06-11-2026 | 04:40pm

నాగిరెడ్డిపేట, నవంబర్ 6 (విజయక్రాంతి): మండలంలోని పోచారం గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం గ్రామంలో నూతన మహిళా సంఘ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

అనంతరం పోచారం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణం కోసం రూ.13.55 లక్షల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో పాఠశాలను సందర్శించి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడారు. సర్వే నంబర్ 268 రైతులతో సమావేశమయ్యారు. రైతుల భూసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే భూముల రీ-సర్వే నిర్వహించి, సంబంధిత సమస్యలను రాబోయే నెలల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అధికారుల నుంచి పూర్తి నివేదిక తీసుకున్న అనంతరం, ఆనివేదిక ఆధారంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని,అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పోచారం గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

గ్రామంలో సుమారు రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ప్రాజెక్టు వద్ద రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది.పోచారం ప్రాజెక్టు అభివృద్ధి, గెస్ట్ హౌస్ నిర్మాణం తదితర పనుల కోసం సుమారు రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది. పోచారం గ్రామానికి 36 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించడం జరిగింది. వీటితో పాటు గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ,పోచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రభాకర్, ఎంపీడీవో గంగాధర్, ఎమ్మార్వో వెంకటరెడ్డి, ఎంపీఓ ప్రభాకర్ చారి, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ కళాలి సురేందర్ గౌడ్, నాయకులు, లక్ష్మణ్ ఠాగూర్, ఇమామ్, మన్నె వెంకట్, సుధాకర్, బెస్త సాయిలు, కిరణ్, మధు, బోరంచ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు