14 July, 2026 | 11:26 PM

మొదటి రోజే గరంగరం

25-06-2024 05:38 AM
  • ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి మచ్చ

రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కాలరాసింది

పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీ

తొలి రోజు ప్రమాణం చేసిన 280 మంది ఎంపీలు

ఇప్పుడు దేశం ఎమర్జెన్సీలోనే ఉంది: ఖర్గే

రాజ్యాంగంపై దాడిని ఆమోదించం: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, జూన్ 24: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులతో భర్తృహరి ప్రమాణ స్వీకారం చేయించారు. లోక్‌సభ పక్ష నేతగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదట ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఆ తర్వాత ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల్లో మొదటి రోజు 280 ఎంపీలు ప్రమాణం చేయగా, మిగిలినవారు నేడు చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. అనంతరం ఈ నెల 27న రాజ్యసభ సమావేశాలు సైతం ప్రారంభం కానున్నాయి. 

వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళతాం..

లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఇది అద్భుతమైన రోజు అని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్వాగతం పలికారు. అందరి సహకారంతో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం జరుగుతోంది. ఈ సారి ఎన్నికలు అద్భుతంగా జరిగాయి. ప్రజలు మా విధానాలను విశ్వసించారు. కొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ  నిర్ణయాలు తీసుకుంటాం. పాలనకు మెజారిటీ అవసరమే కానీ ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రజల అభిప్రాయాలు కూడా ముఖ్యమే. అందరం కలిసి సకాలంలో నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగ పవిత్రతను కాపాడాలి అని ఎంపీలకు పిలుపునిచ్చారు. 

ఎమర్జెన్సీ చరిత్రలో ఓ మచ్చ

మంగళవారంతో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో మోదీ ఈ విషయంపై స్పందించారు. రేపు జూన్ 25. ఈ రోజు భారత ప్రజాస్వామ్యంపై తుడుచుకోలేని మచ్చ పడి 50 ఏళ్లు పూర్తవుతుంది. దేశంలోని కొత్త తరం కూడా రాజ్యాంగాన్ని తిరస్కరించిన ఘటనను ఎప్పటికీ మరచిపోరు. అప్పుడు రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని విస్మరించారు. దేశంలో ఓ జైలులా మారింది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచివేశారు  అని మోదీ సూచించారు. 

రాజ్యాంగంపై దాడిని అంగీకరించం: రాహుల్‌గాంధీ

సమావేశాల  ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ముందు రాజ్యాంగ ప్రతులను పట్టుకుని నిరసన చేపట్టారు. ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి నియామకంపై ప్రశ్నలు సంధించారు. ఆయనకన్నా సీనియర్, 8 సార్లు గెలిచిన దళిత ఎంపీ కే సురేశ్ ఉండగా భర్తృహరిని ఎలా ఎంపిక చేశారని ఎంపీ మానిక్కం ఠాగూర్ నిలదీశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యాంగంపై దాడి చేశారని, అలాంటి చర్యలను ఆమోదించబోమని రాహుల్‌గాంధీ అన్నారు.

భారత్‌లో ఎలాంటి అధికారమైనా రాజ్యాంగాన్ని ముట్టుకోలేదని స్పష్టం చేశారు. దీనిని ప్రతిబింబిస్తూ రాజ్యాంగ ప్రతులను పట్టుకుని ఇండియా కూటమి నేతలంతా కలిసి ఒకేసారి మార్చ్ నిర్వహిస్తూ లోక్‌సభ చాంబర్‌లోకి ప్రవేశించారు. సురేశ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించకపోతే దేశవ్యాప్తంగా ఉన్న దళితులకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు.  

పంచెకట్టులో.. సైకిల్‌పైనా 

ప్రధాని మోదీ, మంత్రుల ప్రమా ణం తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. వీరంతా తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. ఇక కిషన్‌రెడ్డి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు పంచెకట్టులో సభకు హాజరయ్యారు.