బ్యాటరీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- దక్షిణ కొరియా హ్వాసోంగ్‌లో ఘటన
ప్రమాదంలో 20 మంది మృతి
సియోల్, జూన్ 24 : దక్షిణ కొరియాలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిథియం బ్యాటరీ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీ మంటలు చెలరేగడంతో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలపాలవ్వగా.. 23 మంది ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎనిమిది మృత దేహాలను వెలికి తీసినట్లు స్థానిక అగ్నిమాపక అధికారి కిమ్ జిన్ యంగ్ తెలిపారు.
కాగా, రాజధాని సియోల్‌కు దక్షిణంగా హ్వాసోంగ్ పట్టణంలో ఉన్న లిథియం బ్యాటరీ తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగిందని యోన్‌హాప్ వార్తా సంస్థ పేర్కొంది. దాదాపు 35 వేల యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్స్ వరుసగా పేలడంతో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 67 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన అనంతరం దక్షిణ కొరియా ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని స్థానిక అధికారులఆదేశించింది.






