e-KYC గడువు ఆగస్టు 31 వరకు పెంపు.. రేపట్నుంచి 3 నెలల రేషన్
హైదరాబాద్: రేషన్ కార్డుదారుల కోసం ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) ఆగస్టు 31 వరకు పొడిగించింది. రాష్ట్రంలో వర్షాలు, సర్ ప్రక్రియ దృష్ట్యా ఈ-కేవైసీని ప్రభుత్వం పొడిగించింది. ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించేందుకు, గతంలో జూలై 31తో ముగియాల్సిన ఈ గడువును ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 మధ్య ఒకే విడతలో తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటు, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డుదారులు తమ ఈ-కేవైసీని వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని, అలాగే నిర్ణీత గడువులోగా తమకు సమీపంలోని చౌక ధరల దుకాణం (రేషన్ షాపు) నుండి మూడు నెలల రేషన్ కోటాను తీసుకోవాలని కోరారు. పోర్టబిలిటీ ద్వారా ఏ దుకాణం నుంచిైనా రేషన్ తీసుకోవచ్చని సర్కార్ వెల్లడించింది.






