జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత
హైదరాబాద్: పార్టీ మారతానన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డితో(Jeevan Reddy) మంత్రుల సమావేశం ముగిసింది. జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు(Ministers Sridhar Babu), అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశమయ్యారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు గంటకు పైగా మంత్రులు సమావేశం నిర్వహించారు. పార్టీలో గౌరవం దక్కడం లేదని మంత్రుల ముందు జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... జీవన్ రెడ్డిని కలవడానికే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. జీవన్ రెడ్డి పద్దతిగల నాయకుడిగా నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలను తెలియజేశారని వివరించారు. జీవన్ రెడ్డితో అనేక అంశాల గురించి చర్చించామని తెలిపారు. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. మంత్రులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పులేదని ప్రకటించారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరుతారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.




